2, జనవరి 2009, శుక్రవారం

హలో! ఇది తెలుగు లో నా మొదటి బ్లాగ్ పోస్టు. చాలా రోజులనుంచి చెయ్యాలనుకున్న పని. ఇన్నాళ్ళకి, కొత్త సంవత్సరం లో, ఉజ్జోగం లో బలవంతపు షట్ డౌన్ పుణ్యమా అని, తీరిక దొరికింది. నా భుజాన్ని నేనే తట్టుకుని, నా నడుం నేనే బిగించి, ముందుకి అడుగేసాను. సరే, మొదలు పెట్టాను కాని, ఏమి రాయాలి? కొత్త సంవత్సరం కదా...రేసోలుషన్స్ తో మొదలు పెడదాం. బ్లాగ్ చదివేవాళ్ళకి నా రేసోలుషన్స్ తో ఏమి పని అంటారా? రాసేవాడికి చదివేవాడు లోకువ కదా...చిత్తగించండి:
  1. బరువు తగ్గటం. నిన్న బరువు చూసుకున్నాను. అక్షరాలా నూటా డెభ్భై అయిదు పౌండ్లు తూగాను. వామ్మో, వాయ్యో, నిన్ను పగల కొయ్య, కోసి కూర వండితే పది ఊళ్ళకి సరిపోతావు కదరా అనుకుని, గట్టిగా డిసైడ్ చేసుకున్నాను - బరువు తగ్గాలని.
  2. అందులో భాగంగానే, ఇక నుంచి ఓ యేడాది పాటు చల్ల రాయి ఐస్ క్రీమ్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఏమి వేసి చేస్తాడో కాని, ఓ డబ్బా కొనుకొచ్చి తింటూ ఉంటే, స్వర్గం లో ఉన్నట్టు ఉంటుంది. కట్ చేస్తే, చుట్టు కొలత ఓ నాలుగు అంగుళాలు పెరిగి ఉంటుంది.
  3. ఇంతకు ముందు అడపా దడపా జమా ఖర్చులు రాసేవాడిని. ఇక నుంచి రోజూ రాస్తాను. రాసినందుకు ఖర్చులు నియంత్రించుకోవటం లాంటి ఫలితం ఏమైనా ఉంటుందా అని అడక్కండి. గీత లో కృష్ణ పరమాత్మ ఏమి చెప్పాడు? ఏమి చెప్పాడో తెలీదా? సరే వినండి. - కర్మణ్యే వ్యాధి కారస్తే అని చెప్పాడు. (వ్యాధి కాదు, వాది అని వాదించకండి. నేను నా సంస్కృత పాండిత్యం ప్రదర్శించాల్సి వస్తుంది.).
నా రేసోలుషన్స్ కి అతుక్కునే మనో బలం ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ...

భవదీయుడు,
సగటు జీవి.